
ఇన్‌సైడర్ న్యూస్(విద్య): విద్యార్థుల్లో నైతిక విలువలు లోపించాయి. ఉపాధ్యాయులు బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. తల్లిదండ్రులు పట్టించుకోవడంలేదు. సమాజం నాకెందుకని వదిలేసింది. ఫలితం నేటి విద్యార్థుల్లో ఎక్కువ శాతం మందికి వారి తరగతులకనుగుణంగా అభ్యసన సామర్ధ్యాలు లేవు. విద్యాజ్ఞానం లేని విద్యార్థులుగా మారిపోతున్నారు. ఎవరినీ నిందించినా ప్రమాదమే. మరి ఎవరిని తప్పుపడదాం. ఈ విద్యార్థులను ఇలాగే వదిలేద్దామా? 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నేర్చుకోవాల్సిన విద్య నేర్చుకోవడం లేదా? లేక ఉపాధ్యాయులే విఫలమయ్యారా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో నేడు ఏఏడకాయేడు విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏమిటి? ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో పేదవాడికి చదువుకోడానికి ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయా? ఈ పరిస్థితుల్లో దీనిని ఒక ఛాలెంజ్‌గా ఉపాధ్యాయులు పనిచేయాల్సిన సమయం ఇంకా రాలేదా? తాము తీసుకుంటున్న లక్షలాది రూపాయల జీతానికి నిజంగా న్యాయం చేయగలుగుతున్నారా? సమాజం ప్రశ్నించే స్థానంలో ఉంది. సమాధానం చెప్పడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించుకోవాలి. సమాజమే ఎదురుతిరిగితే ఏమౌతుందో ఒకసారి ఊహించుకోవాలి ఉపాధ్యాయులు. తమకు అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించకుండా హక్కులకోసం పోరాడడంపై ఉపాధ్యాయులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. పోరాటాలు చేయొచ్చు, కానీ తమ వద్ద చదువుతున్న విద్యార్థులకు కనీస అభ్యసనా సామర్ధ్యాలు రాలేదనే విషయం కూడా వారు గ్రహించాలి. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కూడా అటువంటి పోరాటామే చేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపట్ల బాధ్యతతో మెలిగితే ఈ సమాజాన్నే మార్చగల మంచి మానవవనరులను అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఉపాధ్యాయులు దీనిని ఒక సవాలుగా స్వీకరించి ముందడుగు వేస్తే విద్యార్థులకు మెరుగైన జ్ఞానం అందుతుందని ఆశిద్దాం. లేకపోతే నైతికవిలువల లోపించిన విద్యార్థులు సమాజానికి ఎంత ప్రమాదకరమో ఇప్పటికే అనేక సంఘటనలు మన కళ్లెదురుగా కనబడుతున్నాయి. తస్మాత్‌జాగ్రత్త.
మరిన్ని వార్తలు:
ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యం ఆధారంగా ర్యాంకులు…
సినీ నిర్మాణ బడ్జెట్ చట్టాన్ని తీసుకొచ్చి బడ్జెట్ పరిమితిని విధించాలి లేదా టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతివ్వకూడదు

Leave a Reply