అధికారులపై నిందలు వేసేకంటే బోధనపై దృష్టి పెడితే మంచిది
నిద్రావస్థలో ఉన్న ఉపాధ్యాయులను తట్టి లేపుతూ, కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ముందుకు సాగిపోతున్నారు. వేలాది రూపాయలను జీతంగా తీసుకుంటున్న ఉపాధ్యాయులు పిల్లలకు బోధించడం కనీస విధిగా ఎత్తి చూపుతున్న ఆయనపై విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా తన దారిలో తాను వెళ్లిపోతున్నారు. ఆయన అడిగేది ఒకటే ‘బోధిస్తే పిల్లలకు చదవడం, రాయడం ఎందుకు రాదు’ అని. ఇది పెద్ద చర్చనీయాంశమే అయినా సరిదిద్దుకోలేనంత తప్పు కాదు అని సామాజిక ఉద్యమకారులు, విద్యావేత్తల అభిప్రాయం. బాధ్యతారాహిత్యంగా ఉన్న కొందరి ఉపాధ్యాయుల కారణంగానే మొత్తం ఉపాధ్యాయ వర్గంపై ఇటువంటి అపవాదు వచ్చిందనేది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల వాదన. వారిని గుర్తించడంలో అధికారలు విఫలమయ్యారనేది విస్పష్టం. ఇప్పటికైనా ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని తెలుసుకుని తమ బాధ్యతలను నిర్వర్తిస్తే, హక్కులకోసం పోరాటంలో ప్రజలు ఎప్పుడూ వారి తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉంటారనే చరిత్ర చెబుతోంది. అంతే తప్ప ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ప్రభుత్వం తమపై దాడి చేస్తున్నారనే అభిప్రాయంతో ఉపాధ్యాయులు రోడ్లమీదకు వచ్చే కంటే, బోధనపై దృష్టిపెట్టి వారిని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా చూసుకుంటే మంచిదని సామాజిక ఉద్యమకారుల అభిప్రాయం.
Leave a Reply