ఇన్‌సైడర్ న్యూస్(సినిమా): సినిమా అంటే వ్యాపారమేనా? సినిమాని వినోదం కోణంలో చూడటం మానేసారా అంటే?! అవుననే అనుకోవాలి. తెలుగు ప్రజలకు వ్యక్తిపూజ జాఢ్యం ఉన్నంతకాలం వినోదం లేని సినిమాలను మనం భరించాల్సిందే. గతంలో ఒక మంచి నవల లేదా ఒక మంచి కథను ఆధారం చేసుకుని సినిమా ఒక సందేశాత్మకంగా, అదే సమయంలో వ్యాపారపరంగా నష్టపోకుండా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిర్మించేవారు. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. హీరోని, హీరో ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం, కథలు అల్లడం దానిని ప్రేక్షకుల నెత్తిన రుద్దడం. దానినే వినోదం అనడం. ఇవన్నీ వ్యక్తిపూజలో మునిగి తేలుతున్న కొంతమందికి ఇవేమీ కనపడవు. కానీ సామాన్య సినీ ప్రేమికుడు కోరుకునే వినోదాన్ని పంచడంలో నేటి సినిమా విఫలమవుతుంది. దీనికి పెద్ద ఉదాహరణ ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద హీరోల సినిమాలు. కథలన్నీ పాతవే. కథనాన్ని కొత్తగా చూపించడం. హీరో ఇమేజ్ తగ్గకుండా చూడాలనే లక్ష్యంతో సినిమాలు దర్శకత్వం వహించే దర్శకులు, దానితో వ్యాపారం చేయాలనుకునే నిర్మాతలు ఉన్న నేటి కాలంలో వినోదాన్ని ఎలా ఆశించగలం? భవిష్యత్తులోనైనా సినిమా మారుతుందేమో చూద్దాం. కేవలం వ్యాపారంకోసం మాత్రమే కాకుండా కోట్లాది సామాన్య సినీ ప్రేక్షకులను దృష్టిలోపెట్టుకుని వినోదాత్మకంగా తీస్తే కుటుంబ సమేతంగా చూడడానికి ఎదురుచూస్తున్నామని తెలుగు సినిమా అభిమానులు కోరుకుంటున్నారు.
కథలు కోకొల్లలు, కానీ ఆదరించే వారేరీ..?
తెలుగు కథా రచయితలకు తెలుగు రాష్ట్రాలలో కొదువలేదు. ఎంతో మంది రచయితలు అవకాశాలు రాక దర్శకులు, నిర్మాతలు చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఒక ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మంచి కథలు దొరికే అవకాశం ఉంటుంది. ఇటువంటి వేదికను ఏర్పాటు చేసి మన రచయితలను ప్రోత్సహించినట్లయితే కొత్త కథలుతో సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బాధ్యతను సినీ పెద్దలు తీసుకోవాలని తెలుగు రచయితల ఆకాంక్ష.

Leave a Reply