ఇన్‌సైడర్ న్యూస్ (పొలిటికల్ డెస్క్): ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు వైఎస్సార్‌సిపి, టిడిపిజనసేన అలయెన్స్ మధ్యే ప్రధానంగా ద్విముఖ పోరు ఉంటుందని అనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ తెరమీదకు వచ్చింది. వనవాసం ముగిసిందంటూ చేసిన ప్రకటనతో మరలా రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా ఉండాలనే సంకేతాలనిచ్చినట్లయింది. వరుసగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ ‘‘వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఎపి’’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తెకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ద్వారా తమ భవిష్యత్ ప్రణాళికను చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. రాజశేఖరరెడ్డి కుమార్తెగా ఎన్నికల్లో ప్రభావం చూపగలరనే ఆశాభావంతో ఆమెను రంగంలోకి దింపింది కాంగ్రెస్. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికలకు సమాయాత్తమవుతున్నారు. అలాగే వైఎస్సార్‌సిపిలోని కాంగ్రెస్ అభిమానులు, టికెట్లు రాని అసంతృప్తులు ఇప్పటికే షర్మిల నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీలను ప్రజాభిప్రాయంతో తయారు చేయాలని కాంగ్రెస్ గ్రౌండ్ తయారు చేసుకుంటుంది. కర్ణాటక, తెలంగాణా తరహాలోనే ఎన్నికల మేనిఫెస్టో ప్రజాకర్షణగా ఉండాలని నాయకులు కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే ఊపు కొనసాగితే రానున్న ఎన్నికల్లో ద్విముఖ పోరుకాస్తా ముక్నోణపు పోటీగా మారనుంది. అయితే కాంగ్రెస్ ఏమేరకు ప్రభావితం చేయగలదనేది ఆయా నేతల దూకుడుపైనే ఆధారపడి ఉంటుంది. మరొక వైపు కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం వలన తమకొచ్చే నష్టమేమీ లేదంటూ వైఎస్సాసీపి నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. టిడిపిజనసేన కూటమి మాత్రం కాంగ్రెస్ వలన తమ ఓటు బ్యాంకుకు వచ్చే నష్టమేమీ ఉండదని, వైసీపీ ఓట్లే చీలుతాయని తమ విజయం నల్లేరుపై నడకేనని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఎవరి ధీమాలో వారున్నారు. కమ్యూనిస్టులు ఏమి చేస్తారో వేచి చూడాల్సిందే. వాళ్లు సొంతంగా పోటీకి నిలబడతారా, కాంగ్రెస్‌తో జతకడతారా అనేది త్వరలో స్పష్టత రానుంది.
Leave a Reply