ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ పోలిటిక్స్ సంస్థ(ఐపిపి) అడ్వైజర్, రాజకీయ విశ్లేషకుడు కృష్ణ ప్రసాద్ తాజా రాజకీయ పరిణామాలనపై రాసిన వ్యాసంలో కొంత భాగాన్ని పాఠకులకు అందిస్తున్నాము.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటు వైసిపి, అటు తెలుగుదేశం పార్టీల్లో పెద్ద కుదుపు వచ్చింది. ఇటువంటి ఫలితాలను బహుశా రెండు పార్టీలూ ఊహించి ఉండవు. తాము ఎలాగైనా గెలుస్తామని వైసిపి అతి అంచనాలు తలకిందులయ్యాయి. ఊహించని ఫలితాలతో ఉత్సాహాన్ని నింపుకున్న తెలుగుదేశం పార్టీ రెట్టించిన స్పీడుతో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. రాజకీయాల్లో నిర్లిప్తతతో కూడిన ధోరణి, మితిమీరిన ఆత్మవిశ్వాసం ఆత్మహత్యా ప్రయత్నంతో సమానం. ప్రస్తుతం వైసిపిని వెంటాడి పీడిస్తున్న ఈ రెండు లక్షణాలను వదిలించికోకపోతే భవిష్యత్తులో మరింత ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా అదనుకోసం ఎదురు చూసే ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి పాత్ర పోషించాలో అదే తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అధికార పార్టీలోని లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది.
తాజాగా మూడు పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఓటమి పాలైన తరువాత లోపాలను గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే కార్యకర్తల్లో నిరుత్సాహం, ఫ్రస్టేషన్ పెరిగిపోయే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు ఓటర్లు లోనయ్యారని ఒకరు, చదువుకున్నవారు కాబట్టి మాకు ఓటెయ్యలేదని మరొకరు మీడియాలో మాట్లాడారు. ఇవి అనవసర చర్చలకు దారితీసే అవకాశం ఉంది. హుందాగా ఓటమిని అంగీకరించడం, అందుకు కారణాలను కిందస్థాయి నుండి వెదికినట్లయితే సరిదిద్దుకోవచ్చు. ఆ రకమైన ప్రయత్నాలు తక్షణమే ప్రారంభించాలి. కానీ ఎమ్మెల్యే కోటాఎమ్మెల్సీ ఎన్నికలు సృష్టించిన గందరగోళం నుండి ఇంకా తేరుకున్నట్లు లేదు.
ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొపెషనల్ పోలిటిక్స్ సంస్థ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో చేపట్టిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. వైసిపి ప్రభుత్వం పట్ల ఇంకా విశ్వాసం కనబరుస్తున్నారనే ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్య, వైద్య సంస్థల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు తమ మద్ధత్తు ఉంటుందని తెలిపారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు మంచివనే అభిప్రాయాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేశారు. కానీ వాటిని అమలు చేసే క్రమంలో అనుసరిస్తున్న విధానం పట్ల ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని అభివృద్ధిని జగన్మోహన్‌రెడ్డి చూపిస్తున్నారని, అదే సమయంలో గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఎదుర్కొనని ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని తెలిపారు. వ్యవస్థను చక్కదిద్దడానికి చేపడుతున్న చర్యలు పట్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు మధ్య వారధిలా ఉద్యోగులు ఉంటారు. ఉద్యోగులపై ఈగ వాలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. లోపాన్ని గుర్తించి దానిని మాత్రమే సరిచేయాల్సిన అధికారులు, పని చేస్తున్నవారిని, చేయనివారిని ఒకేలా చూడటం ఇబ్బందికి గురి చేస్తుంది. సాధారణంగా ఏ ప్రభుత్వమూ ఉద్యోగులను ఇబ్బంది పెట్టే సాహసం చేయదు. కానీ వైసిపి ప్రభుత్వం హయాంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ బాట పట్టాల్సిందేనని జెఎసి రాష్ట్ర నాయకులపై కార్యకర్తలు, వివిధ జిల్లాల నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా అదే విధమైన ధోరణితో ఉన్నారు.
నా పాయింట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఉద్యోగుల్లో మార్పు వచ్చేస్తుందా. ఉద్యోగులు ఉపాధ్యాయుల్ని ఒత్తిడికి గురిచేయడం వలన ప్రజల దగ్గర మెప్పు పొంది ఓట్లు శాతం పెంచుకునే అవకాశం ఉందా అనే కోణంలో విశ్లేషించుకోకుండా గుడ్డిగా వారిపై ఉక్కు పాదం మోపడం శ్రేయస్కరం కాదు అనే అభిప్రాయాన్ని సంస్థ సర్వేలో వెల్లడిరచారు. అసహనం ఎక్కువైతే ఎటువంటి ఫలితాలు వస్తాయో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రుజువైందన్న విషయాన్ని సందేశం లేకుండా ఒప్పుకోవాల్సిందే. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ మరింత దూకుడును పెంచింది. ఇటువంటి క్లిష్ట సమయంలో ఉద్యోగులే ఆదుకుంటారు. ఎందుకంటే వారు ప్రభుతాన్ని ప్రేమిస్తే వారికంటే పెద్ద ప్రచార మాధ్యమం మరొకటి ఉండదు. ఉదాహరణకు ఒక రెవెన్యూ ఉద్యోగి తనదగ్గరకి వచ్చే ప్రజలతో మాట్లాడేటప్పుడు వ్యతిరేకత పెంచాలా, అనుకూలంగా మార్చాలా అనేది వారి చేతిలోనే ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇంత చిన్న లాజిక్‌ను అధికార పార్టీ ఎందుకు విస్మరించిందో అర్థం కాని విషయం. ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగిన ఉద్యోగుల విశ్వాసం ఏ ప్రభుత్వమైతే చూరగొంటుందో ఆ ప్రభుత్వానికి తిరుగుండదు అనే విషయం గతంలో చాలా సార్లు రుజువైంది. ప్రతిపక్ష పార్టీ ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే లోపే అధికార పార్టీ నష్ట నివారణ చర్యలు ఇప్పటికైనా చేపడితే మంచిదని ఉద్యోగుల్లోని అభిప్రాయం.
(సామాన్య ప్రజల్లో చేపట్టిన సర్వేలో వెలుగు చూసిన అభిప్రాయాలు తర్వాత వ్యాసంలో)
Leave a Reply