ఇన్‌సైడర్ న్యూస్(పొలిటికల్ డెస్క్): 2024 ఎన్నికలకు ముందు జరుగుతున్న కర్ణాటక ఎన్నికలను కాంగ్రెస్, బీజెపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం తారాస్థాయికి చేరింది. మరొక వైపు జెడిఎస్ కింగ్ మేకర్ స్టేటస్ కోసం కుస్తీలు పడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపికి బలమైన కేడర్, నాయకత్వం ఉన్న కర్ణాటకలో ప్రధాని మోడీ తానే ప్రధాన ప్రచార కర్తగా మారి వీధి వీధినా తిరుగుతుండడం రాజకీయ విశ్లేషకులకు అంతు చిక్కడం లేదు. స్థానిక నాయకులు కూడా యడ్యూరప్పను, బొమ్మైను ఇతర స్ఠార్ నాయకులను సైతం పక్కన పెట్టి మోడీ జపం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని సర్వే నివేదికలు బిజెపికి ఎదురుగాలి తప్పదని తేలడంతో మోదీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సర్వే అంచనాలను తలకిందులు చేయగల సత్తా ఒక్క మోడీకే ఉందని తలంచిన బిజెపి అగ్రనాయకత్వం ఆయనపై ప్రచార బాధ్యతలు పెట్టడంతో సుడిగాలి పర్యటనలు, రోడ్ షోలు చేస్తున్నారు. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ఎదుర్కొంటున్న వ్యవస్తీకృత అవినీతి ఆరోపణల నుండి మోడీ తన ప్రచారం ద్వారా ఓటర్ల దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుంది. ముస్లిములలో వెనుకబడిన పేదలకిచ్చే నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు లింగాయతులు, ఒక్కలిగల్లో పేదలకు 2 శాతం చొప్పున కేటాయిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం, హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులు పాఠశాలల్లోకి రాకుండా అడ్డుకోవడం, లవ్ జీహాద్ పేరిట విషం చిమ్మటం, ఆలయాల వద్ద ముస్లిములు వ్యాపారం చేయకూడదని, హలాల్ చేసిన మాంసం కొనుగోలు చేయొద్దని, టిప్పు సుల్తాన్‌పై వివాదం ఇలా ఎన్నో వ్యతిరేకతలను మూటగట్టుకున్న బిజెపి`జెడిఎస్ డబుల్ ఇంజన్ సర్కారు వైఫల్యాలను, వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు, డి.శివకుమార్ వంటి బలమైన స్థానిక నాయకత్వం కాంగ్రెస్‌ను ముందుండి నడిస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మే 13 వరకు ఆగాల్సిందే. కాగా నేటితో ఎన్నికల ప్రచారం ముగిసింది.(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ పోలిటిక్స్ చీఫ్ అడ్వైజర్ మరియు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వై.కృష్ణప్రసాద్ వ్యాసం నుండి)
For more news click here
Leave a Reply