ఇన్‌సైడర్ న్యూస్(భీమిలి): పాఠశాలలో చదువుకునే వయసులో ఆకర్షణకు గురై బ్రతుకులు నాశనం చేసుకోవద్దని, కన్నవారి కలలను ఛిద్రం చేయొద్దని విశాఖపట్నం సిటీ దిశ ఇన్‌స్పెక్టర్ జి.నిర్మల విద్యార్థులకు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆనందపురంలో విద్యార్థులకు మంగళవారం దిశ, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థినులు ఎదుర్కొనే సమస్యల గురించి వివరించారు. ఆకర్షణను ప్రేమగా భ్రమపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. పాఠశాలలో చదవుకు తప్ప ఏ ఇతర అనవసర వ్యవహారాలకు తావివ్వకూడదని కోరారు. మైనర్లకైనా మేజర్లయినా చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. తోటి బాలికలను, స్త్రీలను గౌరవించాలని సూచించారు. ఎవరైనా లైంగిక దాడికి పాల్పడితే టీచర్లకు లేదా తల్లిదండ్రులకు ముందుగా తెలియజేయాలని పేర్కొన్నారు. దిశ యాప్‌ను అత్యవసర పరిస్థితులలో ఎలా వినియోగించుకోవచ్చునో తెలియజేశారు. వివిధ నేరాలు, వాటికి పడే శిక్షలు సవివరంగా తెలిపారు. లైంగిక వేధింపులపై విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎటువంటి ఫిర్యాదుల వచ్చినా తక్షణమే దిశ పోలీసులు స్పందిస్తారని తెలిపారు. అనంతర సెల్ఫ్ డిఫెన్స్ గురించి వివరించారు. ఇన్‌స్పెక్టర్ స్వయంగా బాలికలు సెల్ఫ్‌డిఫెన్స్ ద్వారా తమను ఎలా కాపాడుకోవచ్చో ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Leave a Reply