
ఇన్‌సైడర్ న్యూస్: విశాఖపట్నం సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గుమ్మిడి కనకరాజు (50) ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఉదయం వ్యాయామం చేస్తూ ఉండగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, ఆయన సతీమణి పద్మ, ఏసిపిలు రాఘవేంద్రరావు, సీతారాం పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
1995 లో విధుల్లో చేరిన ఆయన 29 ఏళ్ల పాటు పలువురు ప్రముఖులకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గాను, పోలీసు జిమ్ ట్రైనర్ గాను, క్యూఆర్టి టీం సభ్యునిగాను అనేక విభాగాల్లో సేవలందించారు. అలాగే ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.
మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం: పోలీస్ కమిషనర్
హెడ్‌కానిస్టేబుల్ మృతి సమాచారం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఏసిపి అన్నెపు నరసింహమూర్తి హుటాహుటిన వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. కుమారుడికి వీలైనంత త్వరగా ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఆడపిల్లల చదువు నిరాటంకంగా కొనసాగేందుకు కావలసిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. కుటుంబానికి రావలసిన డెత్ కమ్ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ఇతర ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్‌లు వేగంగా వచ్చేందుకు డిపార్ట్‌మెంట్ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన పోలీస్ సిబ్బందికి ఆధునిక గుండె సంబంధిత నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆ మేరకు ఆయన అధికారులను ఆదేశించారు.

Leave a Reply