కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాత్మక ఉచ్చుని బిజెపి గ్రహించలేకపోయింది
ఇన్‌సైడర్ న్యూస్(పొలిటికల్ డెస్క్): కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించి అదే ఉత్సాహంతో తెలంగాణాలో కూడా అధికారం చేజిక్కించుకోవాలన్న బిజెపి ఎత్తుగడలను కర్ణాటక ప్రజలు చిత్తు చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు పోలింగ్‌కు ముందు చెప్పినట్లుగానే పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ పన్నిన ఉచ్చులో బిజెపి పడి చావుదెబ్బ తిన్నదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వై.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికలపై ఆయన రాసిన విశ్లేషణాత్మక వ్యాసలు పలు విషయాలను తెలిపారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టో విడుదల చేయడంతో కర్ణాటక ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మేనిఫెస్టోలో భజరంగ్‌దల్‌ను నిషేదిస్తామని పేర్కొనడమే దీనికి కారణం. వాస్తవానికి అది కాంగ్రెస్ పన్నిన ఉచ్చు. కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని రాబట్టుకుంది.
సాధారణంగా అభివృద్ధి, ఉచితాలు వంటి హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తారు. కానీ ఒక సంస్థను నిషేదిస్తామని చెప్పడం బహుశా భారత రాజకీయ చరిత్రలో ఇదే మొదటి సారి అయ్యుంటుంది. తాము అధికారంలోకి వస్తే భజరంగ్‌దల్‌ను నిషేధిస్తామని చెప్పడం ద్వారా రెండు రకాలుగా బిజెపిని డైవర్ట్ చేయాలని కాంగ్రెస్ అనుకుంది. అవి 1. బిజెపి వైఫల్యాలను, అవినీతిని కాంగ్రెస్ శ్రేణులు కర్ణాటక ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసే క్రమంలో కౌంటర్ క్యాంపెయిన్ చేయనివ్వకుండా భజరంగ్‌దల్ నిషేధం అనే అంశం చుట్టూ బిజెపి ప్రచారాన్ని తిప్పేలా చేయడం. 2. బిజెపి తన ప్రచారంలో తాను ఏం చేసిందో చెప్పుకోనివ్వకుండా చేయడం. ఈ రెండు విషయాల్లో కాంగ్రెస్ విజయం ముందుగానే సాధించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే బిజెపి తన ప్రచారంలో భజరంగ్‌దల్‌ను తప్ప మరొక విషయాన్ని చెప్పలేకపోయింది. భజరంగ్‌దల్ నిషేధం అంశాన్ని ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుని మతపరమైన బలహీనతను వాడుకోవాలని చూసింది. కానీ అదంతా కాంగ్రెస్ పన్నిన ఉచ్చు అని తెలియక మోడీ, అమిత్‌షా దగ్గర నుండి స్థానిక నాయకత్వం వరకు భజరంగ్‌దల్ అంశాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కానీ కాంగ్రెస్ తన వ్యూహాత్మక ప్రచారంతో బిజెపి 40% కమిషన్, ముస్లిమ్ బాలికలహిజబ్, ముస్లిమ్‌ల రిజర్వేషన్ రద్దు, డబుల్ ఇంజన్ ప్రభుత్వ వైఫల్యం, అభివృద్ధిని పట్టించుకోకపోవడం, లింగాయత్‌లలో వ్యతిరేకత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. బిజెపి మాత్రం భజరంగ్‌దల్ అంశం దగ్గరే తన ప్రచారాన్ని కేంద్రీకృతం చేసింది. కాంగ్రెస్ తన పక్కా ప్రణాళికతో బిజెపి ప్రచారాన్ని దారి మళ్లించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇది కాంగ్రెస్ ఉచ్చు అని బిజెపి గ్రహించలేకపోయింది.
For more news visit amoolyaservices.com
Leave a Reply